తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇంట్లో పడిపోవడం వల్ల ఆమె నుదిటిమీద గాయమైంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
నుదిటి మీద గాయంతో మమతా బెనర్జీ ఆసుపత్రికి వచ్చారని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ తెలిపారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు తెలుస్తోందని, దాంతో నుదురు, ముక్కుకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైందని అన్నారు. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఆమె పరిస్థితికి కారణమై ఉంటాయా..? అని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే మమత వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారా..? అనే దానిపై స్పష్టత లేదు. కోల్‌కతాలోని కాళీ ఘాట్‌లోని మమతా బెనర్జీ నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.