చీతాలు అంతరించిపోతున్న తరుణంలో వాటి ఆనవాళ్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర సర్కార్ ప్రాజెక్ట్ చీతా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కుకు 20 చీతాలను తీసుకువచ్చింది. అందులో ‘ఆశ’ అనే చీతా తాజాగా మూడు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరవరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బుధవారం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు కూనలకు చీతా జన్మనివ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా, అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆశకు పుట్టిన కూనల ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో చీతాల సంతతి అంతరించిపోయినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ కింద నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకురాగా అందులో ఆరు చీతాలు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే.