ఆఫ్ఘనిస్తాన్ స్టార్ పెసర్ నవీన్ ఉల్హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరియర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో ఆడిన నవీన్ ఉల్హాక్ శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు.
తన మొదటి వన్డే మ్యాచ్ ను 2016లో ఆడిన నవీన్ ఇప్పటివరకు 15 మ్యాచులు ఆడాడు. 22 వికెట్లు పడగొట్టాడు. అయితే నవీన్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పటికీ టి 20 ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. తన కెరీర్ ను పొడిగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తన చివరి మ్యాచ్లో 6.3 ఓవర్లు బౌలింగ్ చేసిన నవీన్ 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో ఆఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. దీంతో నాకౌట్ చేరలేకపోయినా ఆఫ్గనిస్తాన్ ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. అనంతరం నవీన్ ఉల్హాక్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు.