కేంద్ర సర్కార్ మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ బిల్లును గురువారం రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నియామకాలపై ఇది వరకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నీరుగార్చేలా ప్రభుత్వ చర్య ఉందని ఫైర్ అయ్యాయి. ఎన్నికల సంఘం నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణను పెంచి, ఈసీని తోలుబొమ్మలా చేసేందుకే బిల్లును తెచ్చారని విమర్శించాయి. దీనిని మూకుమ్మడిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చాయి. కేంద్రం ప్రతిపాదనపై కాంగ్రెస్, ఆప్ సహా విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునే నీరుగార్చి, కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించాయి.
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధాన మంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేయాలని సుప్రీం కోర్టు మార్చిలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.