కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కమిషనర్లకు ఆయన స్వాగతం పలికారు.
గత నెల ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఎన్నికల సంఘం నూతన కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధును నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్ట మొదట వారిద్దరూ నియమితులయ్యారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ (మార్చి 15) విచారణ జరపనుంది.