కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీని సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి నెమ్మదిగా చీలుతోంది. ఈ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, టీఎంసీలు సార్వత్రిక ఎన్నికల్లో తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కూటమిలో కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ కూడా ఇండియాకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు సమాచారం.
బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆ వేడుకలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అభ్యర్థిస్తే పట్టించుకోలేదని, చివరకు మోదీ సర్కార్ ఇచ్చిందని కొనియాడారు. అంతే కాకుండా వారసత్వ రాజకీయాలను నీతీశ్ ఖండిస్తూ వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలామంది దృష్టి సారించారని కాంగ్రెస్, లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీని ఉద్దేశించి విమర్శలు చేశారు. తాను మాత్రం రాజకీయాలకు తన కుటుంబాన్ని దూరంగా ఉంచానని నీతీశ్ వివరించారు. ఇలా బహిరంగంగా కాంగ్రెస్పై విమర్శలు చేయడంతో నీతీశ్ ఇండియా కూటమిపై అసంతృప్తిగా ఉన్నారన్న విషయం బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే కూటమికి గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం.