గత ఏడాదంతా మణిపుర్ రాష్ట్రం అల్లర్లతో అట్టుడికింది. మైతేయ్, కుకీ తెగల మధ్య పోరుతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఘర్షణలు సద్దుమణిగినా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. మణిపుర్‌లో 2 నియోజకవర్గాలుండగా.. అందులో ఒక నియోజకవర్గంలో పూర్తిగానూ, మరో నియోజకవర్గంలో సగ భాగానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుంది. మిగిలిన సగ భాగానికి 26వ తేదీన పోలింగ్ జరగనుంది.
పోలింగ్‌కు ఇంకా రెండు వారాలే ఉన్నా.. అక్కడ ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా ర్యాలీలు, సభల్లేవు. కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
మణిపుర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నా జాతీయ స్థాయి నేతలెవరూ అటు కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో ప్రచార తారలుగా బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్ తదితరులను ప్రకటించినా ఇప్పటి వరకూ వారు అక్కడికి వెళ్లలేదు.