దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ అధికారులు, సిబ్బందికి నూతన సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అధికారులు, సిబ్బంది ఫార్మల్ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. క్యాజువల్ దుస్తులు.. ముఖ్యంగా జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్ ధరించరాదు. ఈ మేరకు జైశ్వాల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ చేసిన ఆదేశాల ప్రకారం ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఐ ఆఫీసుల్లోనూ అధికారులు, సిబ్బంది ఫార్మల్ దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. పురుషులు చొక్కాలు, ఫార్మల్ దుస్తులు, షూస్ మాత్రమే ధరించాలి. ఆఫీస్‌కు శుభ్రంగా షేవింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది.
మహిళా అధికారులు, సిబ్బంది చీరలు లేదా సూట్స్, చొక్కాలు, ఫార్మల్స్ ధరించవచ్చు. కానీ జీన్స్, టి షర్టులు, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వియర్ ధరించరాదు. ఈ మేరకు ఈ వివరాలను ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా సీబీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఆఫీసుల్లో సరైన స్థితిని ఉంచేందుకు ఇలా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇప్పటి వరకు అన్ని రకాల దుస్తులకు అనుమతులు ఇచ్చే వారని, కానీ ఇకపై కేవలం ఫార్మల్స్ మాత్రమే ధరించాలని అన్నారు. కాగా సీబీఐ 33వ డైరెక్టర్‌గా జైశ్వాల్ గత వారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే వచ్చీ రాగానే ఆయన సీబీఐ అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక త్వరలో ఆయన ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటారో చూడాలి.