వాహనదారులకు గుడ్ న్యూస్. ఇక నుంచి రోడ్లపై ప్రయాణం ఈజీ కానుంది. వచ్చే నెల (మే 2025) నుంచి దేశంలో టోల్ వసూల్ విధానంలో విప్లవాత్మక మార్పు అమల్లోకి రానుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. మే 1వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ విధానంపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే నాగ్ పుర్లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్ స్థానంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను (GNSS) తీసుకొస్తామని తెలిపారు. వాహనాలు రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఛార్జీలను GNSS ఆటోమేటిక్‌గా వసూలు చేస్తుంది. ఈ విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన పనిలేదు. ఫలితంగా ట్రాఫిక్ జామ్ కాకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది.