డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకూ క్షీణిస్తున్న వేళ ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే దీనిపై స్పందించారు. విలువ క్షీణించడం పై ఆందోళన చెందడం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి చూసుకుంటోందని తెలిపారు. రూపాయి విలువ అనేది ఎవ్వరూ నియంత్రించేది కాదని.. దానికంటూ ఒక స్థిరమైన ధర అంటూ ఉండదని పేర్కొన్నారు. విదేశీ మదుపర్ల నిధులు తలరుతుండటం కూడా రూపాయి విలువ క్షీణతకు ఓ కారణమని పాండే చెప్పారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది. ముఖ్యంగా కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలపై ట్రంప్ సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా రూపాయి విలువ తాజాగా మరో 67 పైసలు క్షీణించి 87.69 వద్ద జీవనకాల కనిష్టానికి చేరింది. 2024 డిసెంబర్ 31న 85.61గా ఉన్న రూపాయి విలువ కొత్త ఏడాదిలోనే దాదాపు 1.8 శాతం మేరకు క్షీణించింది. ముక్యంగా ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు, అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం వంటివి రూపాయి విలువ పతనానికి కారణంగా నిలుస్తున్నాయి.