జనవరి నుంచి పేదల రైళ్లు.. ఏసీ లేని స్లీపర్‌, జనరల్‌ బోగీలే

-

పేద ప్రజల కోసం రైళ్లు నడపాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పేదల కోసం నాన్‌ ఏసీ సాధారణ రైళ్లను నడపాలని నిర్ణయించింది. వలస కార్మికులు, కూలీల కోసం వీటిని క్రమం తప్పకుండా నడపాలనుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా పండుగల సీజన్, వేసవి సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి రైళ్లను నడుపుతామని.. కానీ ఇక నుంచి పేదల కోసం ఏడాది పొడవునా వీటిని నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్వల్ప ఆదాయం ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి అత్యధిక ప్రయాణాలు నమోదవుతున్నాయని అధ్యయనంలో తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

వలస కార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు రైళ్ల అవసరం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ రైళ్లను నడిపే అవకాశముందని రైల్వే బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో జనరల్‌, స్లీపర్‌ కోచ్‌లే ఉంటాయని, ఏసీ ఉండదని చెప్పారు. ఈ రైళ్లను ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, అస్సాం, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో నడపనున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news