దేశంలో ఉన్న వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కొత్తగా ట్రాఫిక్ నిబంధనలను రూపొందిస్తోంది. మోటారు వాహన చట్టాన్ని సవరిస్తూ పలు నిబంధనలకు ఆ మంత్రిత్వ శాఖ మార్పులు, చేర్పులు చేయనుంది.
ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసేవారు. దీని వల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఇకపై అలా ఉండదు.
ట్రాఫిక్ నియమ, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ఇక మీదట కేవలం జరిమానాలు మాత్రమే వేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల పాటు నిలిపివేయడం ఉండదు. ఇది చాలా మంది వాహనదారులకు ఊరటను అందిస్తుంది. ఇంతకు ముందు అయితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయితే వాహనదారుడు ఆ ఏరియాకు మళ్లీ వెళ్లి అక్కడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో లైసెన్స్‌ను తెచ్చుకోవాల్సి ఉండేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది లేదు. లైసెన్స్ ను సస్పెండ్ చేయరు. కనుక దిగులు లేదు. కేవలం జరిమానా చెల్లిస్తే చాలు. అయితే పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఉపేక్షించరు. కఠిన చర్యలు తీసుకుంటారు.