దేశంలోని ప్రముఖుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. భద్రతా తీరుతెన్నులపై త్వరలోనే మోదీ ప్రభుత్వం సమీక్షించనుంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్లు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన కసరత్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్‌ఎస్‌జీ కమెండోలతోపాటు ఐటీబీపీ సిబ్బందినీ ఆ విధుల్లో నుంచి ఉపసంహరించనున్నారు.
‘జెడ్’ విభాగంలోని తొమ్మిది కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు లేదా సీఐఎస్‌ఎఫ్‌లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(ఎస్‌ఎస్‌జీ)కు అప్పగించనున్నట్లు సమాచారం. ఉగ్రదాడులు, విపత్తుల సందర్భంగా ‘స్ట్రైక్ ఫోర్స్’గా వినియోగించుకునేందుకు 1984లో ఎన్‌ఎస్‌జీ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బ్లాక్ క్యాట్ కమెండోలను వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో 450 మంది వరకు బ్లాక్‌క్యాట్ కమెండోలో ఉన్నట్లు సమాచారం. వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక.. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా మోహరించనున్నారు.