కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటికే పెను ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మరో పెద్ద ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) సిద్ధమైంది. శనివారం రోజున దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేయనున్నట్లు వెల్లడించింది. బుధవారం రాత్రి కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొంది.
రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టిన సమయంలో వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయని ఐఎమ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్ మెడిసిన్ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారని.. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్‌ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.