దాశరథి శతజయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలు స్మరించుకున్నారు. దాశరథి కృష్ణమాచార్యులు తన కలం నుంచి విప్లవాగ్ని రగిల్చారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి అని కొనియాడారు. దాశరథి పోరాట పటిమ మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ దాశరథి పోరాట జ్వాల రగిల్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మరోవైపు ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’ ఈ ఏడాది (2024).. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు పాడిన ‘అందెశ్రీ’కి దక్కింది. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రతిఏటా ఈ పురస్కారాలు అందిస్తోంది. భాషా నిలయం గౌరవాధ్యక్షుడు డా.కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కార్యదర్శి టి.ఉడయవర్లు తెలిపారు. దాశరథి జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని భాషా నిలయం సభా మందిరంలో పురస్కారం ప్రదానం చేస్తామని ఆయన వెల్లడించారు.