లోక్‌సభలో మరో 49 మంది ఎంపీల సస్పెన్షన్‌

-

పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన ఉభయ సభల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఘటన జరిగి ఐదారు రోజులైనా ఇప్పటికీ పార్లమెంట్ దద్దరిల్లుతోంది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతుండటంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే లోక్సభలో 46 మందిపై వేటు పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ మరో 49 మంది విపక్ష ఎంపీలను ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్‌ చేశారు.

సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్‌ అబ్దుల్లా, శశి థరూర్‌, కార్తి చిదంబరం, డింపుల్‌ యాదవ్‌, మనీశ్ తివారీ తదితరులు ఉన్నారు.

ఇప్పటికే గత వారంలో 13 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్ కాగా సోమవారం రోజున మరో 33 మందిపై వేటు పడింది. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు లోక్సభలో 95మంది సస్పెండ్ అయ్యారు. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ కాగా.. ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై వేటు పడినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news