పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలోకి ముస్లింయేతరుల నియామకాలు జరగవని, “వక్ఫ్-బై-యూజర్” ఆస్తులతో సహా ఏ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం నుంచి సుప్రీంకోర్టుకు హామీ లభించింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీరుపై పలువురు బీజేపీ ఎంపీలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
న్యాయవ్యవస్థ చట్టాలు చేయాలని అనుకుంటే పార్లమెంటు ఉనికిలో ఉండాల్సిన అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని అన్నారు. ఈ చట్టంపై కేంద్రం తన ప్రతిస్పందన తెలియజేయడానికి సుప్రీంకోర్టు ఒక వారం గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వక్ఫ్ చట్టం సవరణ పిటిషన్లపై. తదుపరి విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసింది.