అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందగానే ఆ ప్రాంతంలో పర్యటించి.. దానిపై ఆరా తీసి.. నిజానిజాలు నిర్ధారించి.. చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా హైదరాబాద్ మియాపూర్ హఫీజ్‌పేట్‌లో పోలీసుల భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హఫీజ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు.
ఈ కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. కొండాపూర్ హఫీజ్‌పేట్ సర్వే నెం.79లో మొత్తం 39.2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సగానికి పైగా నిర్మాణాలు జరిగాయని తెలిపింది. ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైనట్లు వెల్లడించింది. సర్వే నెం.79/1గా సృష్టించి వసంత హోమ్స్ సంస్థ ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించిందని.. మొత్తంగా ఉన్న 39 ఎకరాల్లో 19 ఎకరాలను ఆక్రమించి ఇళ్లను నిర్మించి అమ్మేశారని పేర్కొంది. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో వసంత హౌస్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణాలు చేపట్టినట్లు వివరించింది.