భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఈ తొమ్మిదేళ్ల పదవీ కాలంలో మోదీ 71 విదేశీ పర్యటనలు చేసి రికార్డు సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాల్లో 100సార్లకు పైగా అధికారికంగా మోదీ పర్యటించారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని అడుగుపెట్టని దేశాల్లోనూ పర్యటించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
2014లో ప్రధాన మంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఇటీవలే తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు అనేక దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. ద్వైపాక్షిక చర్చలు సహా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు .ఈ క్రమంలో గతంలో ఏ భారత ప్రధాని అడుగుపెట్టని మంగోలియా, ఇజ్రాయెల్, పాలస్తీనా, రువాండా, బహ్రెయిన్, పపువా న్యూ గినియా లాంటి దేశాల్లోనూ మోదీ పర్యటించారు. ఇలా తొమ్మిదేళ్ల పదవీ కాలంలో 71 విదేశీ పర్యటనలు చేసిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాల్లో 100సార్లకు పైగా అధికారికంగా పర్యటించారు. తాజాగా గురువారం రోజున ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఇవాళ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.