దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అగ్నిపథ్ పథకం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్మీ అంటే రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయడానికి, పరేడ్లు చేయడానికి అని కొందరు అనుకుంటారని.. కానీ సైన్యం అంటే 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం అని మోదీ ఉద్ఘాటించారు.
రాజకీయ వివాదాలలో పాల్గొనడం కంటే సాయుధదళాల నిర్ణయాలను గౌరవించడంపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే అగ్నిపథ్ పథకం తీసుకువచ్చారంటూ విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెన్షన్‌కు సంబంధించి తాము ఏ నిర్ణయాలు తీసుకున్నా.. ఆ ప్రభావం భవిష్యత్తు ప్రభుత్వాలపైనే పడుతుందని వ్యాఖ్యానించారు. సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడం, ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూడటమే ఈ పథకం లక్ష్య అని మోదీ తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన దీనిపై కొందరు మాత్రం రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.