లోక్సభ ఎన్నికల ప్రచారం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనే తరుణంలో పలువురు నేతలు విపక్షాలపై విమర్శలు కురిపించడంలో హద్దులు దాటుతూ వివాదాలకు తెరతీస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రధాని మోదీ కూడా చేరినట్లే కనిపిస్తోంది ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదాహరించారు.
ఆదివారం రోజున రాజస్థాన్‌లోని జాలౌర్, భీన్‌మాల్‌తోపాటు బాంస్‌వాడా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందని మోదీ అన్నారు. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. మొదటిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగు సరళిని చూసి అసంతృప్తికి గురైన మోదీ మరిన్ని విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది. భారతదేశ చరిత్రలో మోదీ స్థాయిలో మరే ప్రధాని ఆ పదవి ప్రతిష్ఠను ఇంతగా దిగజార్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.