అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరకాలంలో భారత్కు అండగా నిలవలేదని వ్యాఖ్యానించారు. సోమవారం రోజున పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ఆయన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ సదస్సులో ఈ విధంగా మాట్లాడారు.
‘గ్లోబల్ సౌత్(పేద దేశాలు)పై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడింది. వాతావరణ మార్పులు, ఆకలి, పేదరికం, వైద్యపరమైన సమస్యలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఆ ప్రభావాన్ని మనమంతా అనుభవిస్తున్నాం. ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ క్లిష్టసమయంలో మేం నమ్మినవారు మాతో నిలబడలేదు. కానీ, భారత్ మాత్రం పసిఫిక్ ప్రాంత దేశాలకు అండగా నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాను’అని మోదీ అన్నారు.
ఎలాంటి సంకోచం లేకుండా పసిఫిక్ దేశాలతో తన అనుభవాలను, సామర్థ్యాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.