ఫ్రాన్స్​కు చేరిన ప్రధాని మోదీకి ప్రవాసభారతీయుల ఘన స్వాగతం

-

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లారు. మోదీకి అక్కడ అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ పారిస్ విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దళాలు మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. ఇరు దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు. పారిస్ లోని హోటల్ వెలుపల పెద్ద ఎత్తున చేరుకున్న ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.

అనంతరం ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారీగా తరలివచ్చిన ప్రవాసీయులను ఉద్దేశించి ప్రసగించారు. భారత వేగవంతమైన అభివృద్ధిని ప్రవాసీయులకు వివరించారు. భారత్‌-ఫ్రాన్స్ యూపీఐ ఉపయోగానికి అంగీకరించాయని తెలిపారు. త్వరలో ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. భారత్‌-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజలే అనుసంధానకర్తలని చెప్పారు. ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు భారత్‌లో విస్తారమైన అవకాశాలున్నాయని వివరించారు.

‘భారత్‌లోని పౌరులు ఎంత ముఖ్యమో, ప్రవాస భారతీయులు అంతే ముఖ్యం. భారత్‌లో పర్యాటక రంగ పురోగతికి ప్రవాసీయులు సహకరించాలి. 9 ఏళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తాం.’ అని మోదీ అన్నారు. ప్రవాసీయులతో సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చిన ప్రైవేట్‌ విందుకు మోదీ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news