భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. నేటితో 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ వజ్రోత్సవ వేడుకలను జరపనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు.
దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కోర్టు కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వోన్నత న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంతో 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమల్లోకి రాగా.. దరిమిలా 1950 జనవరి 28వ తేదీ నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది. ఈ సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకొనే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకు దక్కింది.