ప్రపంచ దేశాలన్నింటిలో ఎవరూ చేయలేని సాహసం.. ప్రయత్నించి ఫెయిల్ అయిన నాలుగు దేశాలు.. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఇస్రో.. ఎట్టకేలకు రెండో ప్రయత్నంలో విజయం సాధించింది. ఎవరూ చేరలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది ఇస్రో రూపొందించిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్. ఇంతటి ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందాన్ని అభినందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరుకు రానున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం మోదీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత ఆయన.. ఆగస్టు 26న సాయంత్రం 7 గంటలకు ఇస్రోను సందర్శించనున్నట్లు తెలిసింది. రెండు గంటలపాటు ఇస్రో శాస్త్రవేత్తలతో మోదీ ఉంటారని సమాచారం. వారిని అభినందించిన తర్వాత దిల్లీకి తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం అక్కడి నుంచి చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఇస్రో బృందాన్ని అభినందించారు.