ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ నెల 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని ఉద్దేశిస్తూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు ‘చేతబడి’ని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని పేర్కొన్నారు.
‘నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారు. ఆగస్టు 5న కొందరు చేతబడిని ప్రచారం చేసే ప్రయత్నం చేయడం చూశాం. నల్లని వస్త్రాలు ధరిస్తే తమ వైరాగ్య కాలం ముగిసిపోతుందని వీరు భావిస్తున్నారు’ అంటూ ఓ జాతీయ వార్తా పత్రికతో మాట్లాడుతూ విమర్శించారు. ‘కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. వారు ఎన్ని మాయలు చేసినా, మూఢనమ్మకాలను విశ్వసించినా ప్రజలు వారిని తిరిగి విశ్వసించరు’ అని అన్నారు.
పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్ వంటి అంశాలపై కాంగ్రెస్ ఈనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేసింది. దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా అంతా నలుపు దుస్తులు ధరించి, నిరసన చేపట్టారు. పార్లమెంట్‌కు నలుపు దుస్తుల్లోనే హాజరయ్యారు. కాగా పోలీసులు అరెస్టులతో ఆ నిరసనలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు.