విపక్షాల కూటమిని ఎదుర్కోవడానికి ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ కొత్త వ్యూహాన్ని సూచించారు. ఆ కూటమిని ఇండియా అని కాకుండా..ఘమండియా అని పిలవాలని ఎంపీలకు మోదీ చెప్పారు. (ఘమండియా అంటే అర్థం దురహంకారి అని) పార్లమెంట్ సమావేశాలు, 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజున బిహార్‌లోని మిత్రపక్షాలతో సమావేశమయ్యారు.
కేంద్ర సర్కారు అన్ని వ్యవస్థల్ని కాలరాస్తోందనీ, దానికి దీటైన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తాము అందిస్తామని విపక్ష కూటమి ప్రకటించింది. కేంద్రంలోని అధికార ఎన్డీయేపై పోరుకు జట్టు కట్టిన విపక్షాలు ఇటీవల తమ కూటమి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్(ఐఎన్‌డీఐఏ- ఇండియా) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించాయి. ఈ కొత్త పేరుపై, విపక్ష పార్టీలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో విమర్శలు గుప్పిస్తున్నారు.