ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ధ్యాన మందిరం ఉంది.ఇవాళ వారణాసి వెళ్లిన ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఉమ్‌రహలో నిర్మించిన స్వరవేద్ మహా మందిరాన్నిప్రారంభించారు. 7 అంతస్తుల్లో ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. స్వరవేద శ్లోకాలను గోడలపై అద్భుతంగా చెక్కారు. ధ్యాన మందిరం శిల్పాకళా కౌశలం చూసి ప్రధాని మోదీ అబ్బురపడ్డారు. నిర్వాహకులు ధ్యానమందిర విశిష్టతలను ప్రధానికి వివరించారు.
ప్రధాని ధ్యాన మందిరం నలువైపులా పరిశీలించారు. అనంతరం కాసేపు అక్కడ ధ్యానం చేశారు. ధ్యానం మనలో ఏకాగ్రతను పెంచుతుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. రోజులో కనీసం 15 నిమిషాలైనా ధ్యానానికి కేటాయించాలని సూచించారు. దీనివల్ల మానసిక, శారీరక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయని చెప్పారు. కోపం వంటి విపరీత భావాలను ధ్యానం వల్ల నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.