కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వయనాడ్ స్థానం నుంచి యువరాజును తరిమికొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న పొత్తు గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఇవాళ కేరళలో పర్యటించిన ఆయన సెంట్రల్ స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ రెండు పార్టీలు కేరళలో బద్ధశత్రువులుగా ఉంటాయని, ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం మంచి స్నేహితులుగా మెలుగుతాయని, ఆ పార్టీల నేతలు కలిసి కూర్చొని విందారగిస్తారని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలను బీఎఫ్ఎఫ్(Best Friends Forever) అంటూ ఎద్దేవా చేశారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీని వెళ్లగొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని, కేరళకు దూరంగా ఉండమని ఆయనకు సలహా ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వయనాడ్‌లో సీపీఐ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది.