ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చారంటూ ప్రధాని మోదీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చారని అన్నారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరీకీ కృతజ్ఞతలు తెలిపారు. మన బాలరాముడు ఇకనుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని .. మన రామ్ లల్లా ఇకనుంచి మందిరంలో ఉంటారని చెప్పారు. రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. దేశ విదేశాల్లో ఉన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
“ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నాను. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేశాం. న్యాయస్థానాల తీర్పు తర్వాతే మన కల సాకారమైంది. ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించాను. రామనామం.. ఈ దేశప్రజల కణకణంలో నిండి ఉంది.” అని ప్రధాని మోదీ అన్నారు.