జమ్ముకశ్మీర్ ప్రజలు ఉగ్రనీడ నుంచి బయటపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. చాలా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్‌లో ఆ పరిస్థితులు లేవు. వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవి. అంతలోపే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాలి. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
భారత మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని ఆయన విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు . అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్వితీయమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని మోదీ అన్నారు.
ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని.. ఈ రోజు భారత్ కొత్త శిఖరాలను అందుకుందని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ జీ20 నిర్వహించిన తీరుతో ప్రపంచం ఆశ్చర్యానికి గురైందని తెలిపారు. ప్రపంచంలో చాలా సంక్షోభాలు ఉన్నా.. భారత్ సరిహద్దులు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.