ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాదిన రెండ్రోజుల పర్యటన ప్రారంభమైంది. ఇవాళ ఆయన తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలో పర్యటించిన మోదీ భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకులు సాధిస్తున్నాయిని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుకుని మంచి ర్యాంకుల్లో నిలుస్తున్నాయని మోదీ తెలిపారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటోంది అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.19,850 కోట్లతో అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏవియేషన్, రైలు, రోడ్డు, షిప్పింగ్ రంగాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ‘యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి. వర్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. దేశంలోని విమానాశ్రయాలను పదేళ్లలో రెట్టింపు చేశాం. దేశంలోని 74 విమానాశ్రయాలను పదేళ్లలో 150కు పెంచాం. ప్రధాన పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం రెండింతలు చేశాం.’ అని మోదీ అన్నారు. మరోవైపు రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కవరత్తిలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.