మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. వాజ్పేయీతో తమకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్‌ను ఇవాళ వీరు సందర్శించారు. మాతృభూమి పట్ల వాజ్‌పేయీ చూపిన అంకితభావం భవిష్యత్తు తరాలకు స్పూర్తి అని మోదీ కొనియాడారు. ఈ దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
వాజ్‌పేయీ జీవితంలోని వివిధ ఘట్టాల సమాహారంగా ఉన్న వీడియోను మోదీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోకు మోదీ గళం అందించి దేనిలోనైనా హాస్యాన్ని వెతకగల సామర్థ్యం వాజ్‌పేయీ సొంతం అంటూ కొనియాడారు. పార్టీ సమావేశాల్లో వాతావారణం వేడెక్కుతున్న సమయంలో.. ఒక జోక్ పేల్చి నవ్వులు పూయించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేది అని మోదీ ప్రశంసించారు.