ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ రోజుకో ఫీచర్ తో యూజర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే రకరకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తాజాగా ఛానెల్స్ ఫీచర్ ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే ఛానెల్స్ ఫీచర్ ఉండేది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా వచ్చేసింది. భారత్ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది.
తాజాగా వాట్సాప్ ఛానెల్స్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరారు. మోదీకి సంబంధించిన సమాచారన్నంతా వాట్సాప్ యూజర్స్ సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వాట్సాప్ ఛానెల్ లో ఎంట్రీ ఇచ్చిన మోదీ.. తొలి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టులో మోదీ కొత్తపార్లమెంట్ వద్ద దిగిన ఫొటో పోస్టు చేశారు. దాని కింద ‘మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నా’నంటూ క్యాప్షన్ జోడించారు. మరోవైపు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వాట్సాప్లో జాయిన్ అయ్యారు.
సోషల్ మీడియాలో మోదీకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. దేశంలో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు.