సాధ్యాసాధ్యాలు: రాజస్థాన్ లో బీజేపీ పాగాపై క్లారిటీ!

-

రాజస్థాన్ లో సచిన్ పైలట్ వర్గం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో చోటుచేసుకున్న అంతర్గత విబేధాలతో అధికారం అతలాకుతలం అవుతోంది. అలాగే… సచిన్ పైలట్ వర్గం పార్టీని వీడి, బీజేపీకి మద్దతు పలకాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అలా ఇస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా అనేదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోన్న చర్చ. ఇలాంటి సమయంలోనే మరోసారి రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల లెక్కలు ఎవరెటు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొత్తం 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 101. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో తన సభ్యులైన ఇతర మద్దతుదారులతో కలిసి మొత్తం 121 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.

అయితే వాస్తవానికి ఈ బలంతో కాంగ్రెస్ పార్టీ నిశ్చింతగా ఎలాంటి అరమరికలు గందరగోళాలు లేకుండా ఐదేళ్ల పాటు ప్రభుత్వం సాగించవచ్చు. కానీ ఆధిపత్య పోరు, అధికార ఆర్భాటాలు మరీ ఎక్కువైపోయి ప్రభుత్వం పడిపోతే తప్ప! కాగా సీఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ వర్గం ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అలాగే… సచిన్ పైలట్ కు 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర సభ్యుల బలముందనే టాక్ కూడా విపరీతంగా వినిపిస్తోంది. అదే జరిగితే… రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 101 మంది ఎమ్మెల్యేలుండగా, మాయవతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలతో కూటమిలో భాగంగా ఉన్నారు. వీరికి 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు, సీపీఐ-ఎం, భారతీయ ట్రైబల్ పార్టీలకు చెందిన ఇద్దరేసి సభ్యుల మద్దతు కొనసాగుతోంది ఇప్పుడు. మరి ముందు ముందు అవి ఎలా ఉంటాయి అనేది రాజకీయ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

కాగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే.. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ సభ్యులు ముగ్గురితో కలిపి 73 మంది ఎమ్మెల్యేల బలముంది. అయితే.. ప్రభుత్వాన్ని కూలదోయాలంటే బీజేపీకి కనీసం మరో 28 మంది ఎమ్మెల్యేల అవసరం ఖచ్చితంగా ఉంది. సచిన్ పైలట్ వర్గం 19 మంది బీజేపీకి మద్దతుగా నిలిచినప్పటికీ… అధికారానికి ఆ పార్టీకి మరో 10 మంది వరకూ ఎమ్మెల్యేల మద్దతు అవసరమనేది ఇప్పుడు బీజేపీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరి ఆ 10మంది ఎమ్మెల్యేలు ఎక్కడనుంచి తేవాలి, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేదానిపై తీవ్రంగా తప్జనభర్జనలు నడుస్తున్నాయి.

అంతేకాకుండా ఇక సచిన్ పైలట్ వర్గం కాని బీజేపీలోకి వస్తే.. స్వతంత్ర సభ్యులను సులువుగా ఆకర్షించవచ్చని బీజేపీ నేతలు సుదీర్ఘ ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో అది అంత సులువు కాదని.. ఇదే జరిగితే మిగతా రాష్ట్రాలకు.. దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన వాళ్లమౌతామని కూడా టాక్ నడుస్తోంది. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనుసరించిన విధానంతో అధికార యావకు సంబంధించి బీజేపీ కాస్త చెడ్డ పేరు తెచ్చుకుందని… రాజస్థాన్ విషయంలో అలా వ్యవహరించదని స్పష్టమౌతుంది. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version