రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు ఎన్నికల చట్టాల కింద అవినీతి పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ (కాంగ్రెస్) ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటరు శశాంక శ్రీధర దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో కర్ణాటక ఎన్నికల వేళ విడుదల చేసిన మేనిఫెస్టోలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలు.. ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం అందించేవేనని పిటిషనర్ పేర్కొన్నారు. అలాంటి వాగ్దానాలు చేయడం ఎన్నికల్లో అవినీతికి పాల్పడటం కిందకే వస్తుందని వాదించగా.. ఆ వాదన సరికాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం తాజాగా అభిప్రాయడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన ఆరోపణలతో బీజేపీ విడుదల చేసిన ప్రచార ప్రకటనలను నిలివేస్తూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆ ప్రచార ప్రకటనలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొనడంతో కోర్టు అనుమతితో బీజేపీ తరఫు న్యాయవాది పి.ఎస్.పత్వాలియా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.