దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేసే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిబంధనలను ఉల్లంఘించినందున బెయిల్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ తనకు సమన్లు జారీచేయబోమని అడిషినల్ సొలిసిటర్ జనరల్ సర్వోన్నత న్యాయస్థానానికి వాగ్దానం చేసినా, దాన్ని తుంగలో తొక్కి ఈడీ తనను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తన బెయిల్ అప్లికేషన్లను కొట్టివేస్తూ దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కవిత తరఫున సీనియర్ అడ్వొకేట్ విక్రమ్ చౌధరి సుదీర్ఘ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. నేడు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. వారి వాదనల తర్వాత రిజాయిండర్ వాదనలకు అవకాశం ఇవ్వాలన్న కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే.