ఇవాళ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా ఓ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకలకు హాజరుకావడానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం కావడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇంతకీ ఏం జరిగిందంటే
యోగా దినోత్సవాన్ని దిల్లీ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన అక్కడికి రాగానే ఆయనకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ నల్లజెండాలు ప్రదర్శించి ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో చేసేదేమీ లేక మంత్రి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేంద్రం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ పరిణామాల వేళ ప్రధాన్ స్పందిస్తూ.. నీట్ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు.