ట్రక్కును పికప్ వ్యాన్ ఢీ కొట్టిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో పాటు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్- కల్యాణ్ జాతీయ రహదారిపై ఓ పికప్ వ్యాన్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులను గణేష్ మస్కరే (30), కోమల్ మస్కరే (25 సంవత్సరాలు), హర్షద్ మస్కరే (4), కావ్య మస్కరే (6) గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.