ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ క్షేత్ర రత్న భాండాగారాన్ని ఈరోజు (జులై 18వ తేదీ 2024) మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది.
రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న అనంతరం రత్నభాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌రూంలో భద్రపరచనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆభరణాలను వేరే చోటు తరలించనున్నారు. ఆభరణాలన్నిటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ అధికారులు, రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తున్నారు.