బీజేపీ ఎంతో హడావుడి చేస్తుంది కానీ, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం ఆ పార్టీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబయిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మూడో వంతు మెజార్టీ అవసరమని ఆ పార్టీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ స్పందించారు.
సత్యం, ప్రజల మద్దతు తమ వైపే ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న పోరు బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ ఇది అని అభివర్ణించారు. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని వాళ్లు అనుకుంటే.. అధికార వికేంద్రీకరణ ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు జ్ఞానం ఉండదని కాషాయ శ్రేణులు విశ్వసిస్తాయన్న రాహుల్.. ఓ వ్యక్తి ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన, అతడు రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదని పేర్కొన్నారు.