లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి లోక్ సభలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన నివాసం విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీకి.. దిల్లీ తుగ్లక్ లేన్లో ఉన్న 12వ నంబర్ బంగ్లాను తిరిగి కేటాయించారు. సభ్యత్వం కోల్పోయిన తర్వాత లోక్సభ సెక్రెటేరియట్ ఆదేశాలతో ఈ ఇంటిని రాహుల్ గాంధీ ఖాళీ చేశారు.
తాజాగా ఎంపీగా తిరిగి నియమితులైన నేపథ్యంలో మళ్లీ ఇదే ఇంట్లో రాహుల్ అడుగుపెట్టనున్నారు. అయితే, భారతదేశం మొత్తం తన ఇల్లేనని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బంగ్లా కేటాయించినట్లు ఎస్టేట్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు రాహుల్ గాంధీ ఆగస్టు 12-13 తేదీల్లో వయనాడ్లో పర్యటించనున్నారు. పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. రాహుల్ పర్యటన వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.