లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం రోజున చర్చ మొదలైంది. ఇందులో భాగంగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. శివసేన(యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ సహనం కోల్పోయారు. ఆయన ప్రవర్తనను విపక్ష పార్టీలు తప్పుపట్టాయి.
ప్రధాన మంత్రిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సావంత్‌కు లేదంటూ నారయణ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘’సావంత్.. మీరు కూర్చోండి. ప్రధాన మంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే.. దాని పరిణామాలు ఎదుర్కొంటారు’ అని లోక్‌సభ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో లోక్‌సభ స్పీకర్ ఆయన్ను మందలించాల్సి వచ్చింది. సరైన పదజాలం వాడండి అంటూ సూచించారు. రాణె ప్రవర్తనపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి.