2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి పరిమితమవుతారా? లేక ఆపన్నహస్తం అందించిన వయనాడ్ నుంచే కొనసాగుతారా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.
వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వయనాడ్ జిల్లాలో రెండు ఎస్టీ రిజర్వుడ్, మలప్పురంలో ఒకటి ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే. కోజికోడ్ జిల్లాలో క్రైస్తవ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాహుల్ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది.