రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం రోజున ఆ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో 200 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నరాజస్థాన్ రాజెవ్వరో డిసెంబర్ 3న వెల్లడయ్యే ఫలితాల ద్వారా తెలియనుంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలతో పాటు ఏడు ఉచిత హామీలు తమకు మళ్లీ అధికారం కట్టబెడ్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా మరోవైపు.. ప్రభుత్వ వ్యతిరేకత, పరీక్ష పేపర్ల లీకేజీ, ప్రధాని మోదీ ఛరిష్మాపై బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రాజస్థాన్ ప్రజలు ఎవరిని రాజు చేయాలనుకుంటున్నారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా.. కాంగ్రెస్కు 108, మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి ఒక సీటు ఉంది. 12 మంది స్వతంత్రులు సైతం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీకి 2024 జనవరి 17 వరకు గడువు ఉంది. రాజస్థాన్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా.. బీఎస్పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. ఇక ఈ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.25 కోట్లు ఉన్నారు.