రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీ వ్యాఖ్యలు చేసిన ఓ మంత్రిని గంటల వ్యవధిలోనే బర్తరఫ్ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. సీఎం సిఫార్సుకు ఆ రాష్ట్ర గవర్నర్ కూడా వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్రను బర్తరఫ్ చేస్తునట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందని అసెంబ్లీలో రాజేంద్ర ప్రశ్నించారు. రాజస్థాన్లో మహిళలపై వివక్ష రోజురోజుకు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “మణిపుర్ ఘటనను లేవనెత్తే బదులు.. ముందు మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి”. అని రాజస్థాన్ అసెంబ్లీ వేదికగా రాజేంద్ర వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై రాజేంద్ర విమర్శలు గుప్పించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సిఫార్సును గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. రాజేంద్ర హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి.