చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదించింది. నారి శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ చారిత్రక బిల్లుకు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా 215 మంది ఓటు వేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందడంతో దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది. డీలిమినేషన్ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. ఈ బిల్లుపై రాజ్యసభలో చేపట్టి చర్చలో ఉభయ సభల నుంచి పలు పార్టీలకు చెందిన 132 మంది భాగస్వాములు అయ్యారని ప్రధాని మోడీ తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు ప్రకటించిన ప్రతీ ఒక్కరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్ సభలో న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. 20వ తేదీ వరకు చర్చ జరిగింది. లోక్ సభ సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరూ వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభ రెండింటిలో ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది.