రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల విషయంపై బహిరంగంగా చర్చ జరగాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై సమగ్ర చర్చ జరగాలని తెలిపారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అసవరం ఉందని అన్నారు. అందుకోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని.. ఈ మేరకు ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు.
‘ఉచిత హామీలకు అయ్యే వ్యయం-చేకూరే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదే. భారత్ వంటి పేద దేశంలో అత్యంత బలహీనవర్గాలకు కొన్ని భద్రతలను కల్పించడం దాని బాధ్యత. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని ఎంత వరకు విస్తరించవచ్చనేది సమీక్షించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలి. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఏటా 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేయాల్సిన అవసరం ఉంది.’ అని దువ్వూరు సుబ్బారావు అన్నారు.