ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ రెండు వేల నోట్ల మార్పిడి. ఈ వ్యవహారంపై ప్రజలు ఇప్పటికే గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెండు వేల నోట్ల మార్పిడిపై కీలక విషయాలు వెల్లడించారు. నగదు నిర్వహణలో భాగంగానే రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడంలో భాగంగానే రూ.2,000 నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు రూ.2,000 నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని అన్నారు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ కార్డు వివరాలు సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు దాస్ గుర్తు చేశారు. అదే నిబంధన రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.