దశాబ్దాల పాటు శ్రీరాముడి జన్మభూమిలో ఆయనకు దివ్యమందిరం నిర్మించాలనే దృఢ సంకల్పంతో శ్రమించిన బీజేపీ ఎట్టకేలకు ఇటీవల దివ్య రామమందిరాన్ని నిర్మించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట గత జనవరిలో అట్టహాసంగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహించి అయోధ్య మందిర్ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంది. కానీ అయోధ్య రాముడి ఆలయం కొలువై ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్థి ఘోర ఓటమి పాలయ్యారు. అయితే బీజేపీని ఎందుకు తిరస్కరించారనేందుకు స్థానికులు ఎన్నో ఆసక్తికర కారణాలు చెబుతున్నారు. అందులో మచ్చుకు కొన్ని ఏంటంటే..?
గొప్ప ఆలయం నిర్మించడం మంచిదే.. కానీ, తమ భూములను లాక్కుంటే ఎలా బతికేదంటూ అయోధ్యలో అభివృద్ధి పేరిట విమానాశ్రయం, రహదారుల కోసం చేస్తున్న భూసేకరణపై స్థానికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. భూములను తీసుకున్నందుకు అయోధ్యలో దుకాణాలు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదనే అసంతృప్తిలో వారిలో ఉంది.
మరోవైపు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు సైతం ఓటర్లను ఆలోచింపజేశాయి. స్థానిక యువతను నిరుద్యోగం వేధిస్తోంది. వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్ ఫైజాబాద్, అయోధ్య ప్రగతికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, పైగా రామమందిరం పేరిట తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారనే అపవాదు ఉంది.